Wednesday, February 4, 2009

లఘుచిత్ర నిర్మాణం - కొన్ని సంగతులు

వేలయోజనాల దూరమని తెలిసినా… ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్నే సినిమాకి అన్వయిస్తే…అక్కడా ఓ సక్సెస్‌ ఫార్ములా కనబడుతుంది. సరదాగా మనింట్లో తిరుగాడే …అల్లరి పెట్‌ ప్రవర్తనను సిల్లీగా చిత్రీకరించినా….ఆ అలవాటే ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి పురికొల్పవచ్చు. అనూహ్యంగా అది అందలమెక్కనూవచ్చు. సరదాగా మొదలైన వ్యాపకమే ముదిరి పాకానపడి ఓ పెద్ద సినిమా అవకాశానికి ఊపిరులూదనూ వచ్చు. బిగ్‌స్క్రీన్‌ కలలను నిజం చేయనూ వచ్చు. ఆనక కమర్షియల్‌ పంథాలో ఎదగడానికి… అదే కారణమూ కావొచ్చు. అలా ముందుకెళ్లినవాళ్లు ఎంతోమంది. ఈ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకునేవారికోసం షార్ట్‌ఫిల్మ్‌-మేకింగ్‌పై సంగతులు…
షార్ట్‌ ఫిల్మ్‌ (లఘుచిత్రం) అంటే…
40 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ నిడివిగల చిత్రమని అర్థం. (అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌-నార్త్‌ అమెరికా చిత్రపరిశ్రమ నిర్వచనమిది). ఇదే ప్రామాణికంగా ఉంది.
షార్ట్‌ఫిల్మ్‌ సొంతంగా తీయడమెలా…
ముందుగా ఏమేమి కావాలి…
వీడియో/ఆడియో రికార్డర్‌, కంప్యూటర్‌, ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌(ప్రస్తుతం అవిడ్‌ ఉపయోగిస్తున్నారు. ఎఫ్‌సిపి కొత్తతరం సాఫ్ట్‌వేర్‌). ఇవేమీ అందుబాటులో లేనివారు ఎడిటింగ్‌ పనులు ల్యాబ్‌లో చేయించుకోవడమే ఉత్తమం.
నటీనటులను సమకూర్చుకోవడం ఎలా….
స్నేహితులు, బంధువర్గాల్లో ఔత్సాహికులు, కష్టించే గుణం ఉన్నవారిని వెతికి పట్టుకుంటే సరి. చిత్రీకరణ సమయంలో అందరికీ తిండి-పానీయాల సంగతి మీరే చూసుకోవాలి. తయారుచేసిన సబ్జెక్ట్‌కు రైటర్స్‌ ఫోరం నుంచి అనుమతి తప్పనిసరి.
ఏం చేయాలి….
ఓ సబ్జెక్ట్‌ను ఎంపిక చేయండి. బేసిక్‌ ఐడియా ఒకటి అనుకోండి. అందుకు.. చిన్న కథలు సెలక్టివ్‌గా ఎంపిక చేసి చదవండి. ఐడియాలు అవే వస్తాయి. చదవడమంటే…? చదివేటప్పుడే దృశ్యీకరణకు సంబంధించిన విజువల్స్‌ మీ కళ్లలో ప్రత్యక్షం కావాలి. అంతగా లీనమవ్వాలి. మీదైన ఓ ప్లాట్‌ (కథ)ను సిద్ధం చేసుకోండి. సరైన నేరేషన్‌తో స్క్రీన్‌ప్లే రూపొందించండి. దానికి సీనిక్‌ ఆర్డర్‌ ప్రిపేర్‌ చేయండి. స్క్రిప్ట్‌ కాగితం మీద సిద్ధమయ్యాక…పాత్రల చిత్రణమీద దృష్టి నిలపండి. అనుభవజ్ఞుల పరిశీలన ఉంటే మంచిది. తర్వాత విభిన్న వ్యక్తిత్వాలను పాత్రలు ప్రతిభింబించేలా జాగ్రత్తపడండి. అది ప్రేక్షకుడిలో ఉత్సుకతను పెంచగలగాలి.
స్టోరీ బోర్డ్‌ తయారీకి…పేజ్‌లో నిలువుగా మధ్యలో ఒక గీత గీయండి. ఎడమవైపు స్క్రీన్‌ప్లే, కుడివైపు మాటలు రాసుకోండి. (ఉత్తమ స్క్రీన్‌ప్లేలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఛాయాగ్రహణం.., కళ్లను మిరుమిట్లు గొలిపే దృశ్యీకరణకే ప్రాధాన్యత అని సినీమేథావుల ఉవాచ …ఇది గుర్తుంచుకోండి). స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమయ్యాక సాంకేతిక పరికరాలను సిద్ధం చేయండి. విసిఆర్‌, ఎడిట్‌ ఎక్విప్‌మెంట్‌తో వీడియో రికార్డర్‌ అనుసంధానమై ఉండాలి. ఎలాంటి సందర్భాల్లోనయినా, ఏదైనా చిత్రించడానికి రెడీగా పరికరాలుండాలి. ముందుగా….రికార్డింగ్‌ ప్రారంభించడం, నిలిపివేయడం, ఫాస్ట్‌ ఫార్వార్డ్‌ చేయడం, రివైండ్‌, ప్లేబాక్‌ చేయడం, లాంటి వాటిపై కొంత కసరత్తు చేయాలి. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సేవ్‌ చేసి ఉంచడం ఉపయోగకరం. తర్వాతి ప్రాజెక్ట్‌లకు అవసరమైనప్పుడు వాటిని మళ్లీ వినియోగించుకోవచ్చు.
స్క్రిప్ట్‌ తయారీకి ముందు….
కొన్ని హాలీవుడ్‌/బాలీవుడ్‌ లేదా ఏదైనా ..ఉడ్‌నుంచి సినిమాలు చూడండి. వాటిలో ఉపయోగించిన స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌, చాయాగ్రహణం వంటి విషయాలను స్టడీ చేయండి. వాటిలో అవసరమైన, ఆశక్తికరమైన వాటిని పాయింట్లవారీగా ఓ బుక్‌లో నోట్‌ చేయండి. ఆ సిడిలను లైబ్రరీలో భద్రపరచండి. తర్వాత ప్రిట్రయల్స్‌కోసం…సింపుల్‌గా ఓపని చేయండి. ఓసారి మీ పెంపుడు కుక్క యాక్టివిటీస్‌ పరిశీలించండి. తిన్నా, పడుకున్నా, కుప్పిగంతులేసినా, అది ఏంచేసినా చిత్రీకరించండి. దానిని వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఎడిట్‌ చేసి, నేపథ్యసంగీతం సమకూర్చండి. తదుపరి పయనానికి ఉపయోగపడుతుంది. లాంగ్‌ షాట్‌, మిడ్‌ షాట్‌, క్లోజ్‌ షాట్‌, లాంగ్‌ మిడ్‌ షాట్‌, క్లోజ్‌ మిడ్‌ షాట్‌ ఇలా డివిజన్లుగా చిత్రీకరించే పద్ధతిని తెలుసుకోండి. సొంత సిస్టమ్‌లో సినిమా చూసేటప్పుడే వాటిని పరిశీలించే సౌలభ్యం ఉంటుంది. డోంట్‌ సీ మూవీ…స్టడీ మూవీ…అనే పద్ధతి ఆవశ్యం.
హ్యాండీకామ్‌లు, డిజిటల్‌ మిని-డివిడి కెమెరాలతో ఇప్పటికే షార్ట్‌లు తీసినవారెందరో. అలాంటి వారిని కలిస్తే పని సులువవుతుంది. వారివద్ద 10 వేలకే షార్ట్‌ తీయడమెలాగో చిట్కాలుంటాయి. ఇంకా తక్కువ ఖర్చు ఫార్ములా దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉపయోగించే కెమెరా, వాటిలో వాడే లెన్స్‌ గురించి కనీస అవగాహన ఉండాలి. ఇవన్నీ సమయపాలనకు, ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లాక గుడ్లు తేలేయడం దండగమారి పని. ఎడిటింగ్‌, కెమెరా వర్క్‌ను స్టడీ చేయడం అవసరం. బడ్జెట్‌లో పనిపూర్తి చేసేలా ప్లాన్‌ ఉండాలి.చిత్రీకరణలో ఉపయోగించే టెర్మినాలజీ (పదజాలం) తెలిస్తే పని సులువు. షార్ట్‌మూవీని… షార్ట్‌- అని సింపుల్‌గా పిలవొచ్చు.
ఎడిటింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ (నేపథ్య సంగీతం), డైలాగ్‌ ట్రాక్‌ ఎలా మిక్స్‌ చేస్తున్నారో తెలుసుకోండి. మనకే తెలిస్తే ఎడిటర్‌కు తగిన సూచనలివ్వొచ్చు. ఇంటర్‌నెట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్స్‌ వివరాలు సేకరించండి. కొన్ని సంస్థలు ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌, ఐమూవీ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ, …ఇంకా బోలెడన్ని సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా ఆఫర్‌ చేస్తున్నాయి. ఫిలిం మొదలెట్టకముందే ఈ పని/పనులు చేయాలి. సినిమా తీయడం పూర్తయితే…మీరు తీసిన సినిమా డిజిటల్‌ ఫార్మాట్‌లో (ఔట్‌పుట్‌-రీడబుల్‌ ఫార్మాట్‌) ఉంటే …సిడిలను రూపొందించుకోవడం మరువద్దు. వాటిని మెయిల్‌లో కావాల్సినవారికి కూడా పంపుకోవచ్చు. ఇహ… మన షార్ట్‌ ప్రచారానికి….నెటిజనుల ముందుకు డేగలా ఎత్తుకెళ్లే యూట్యూబ్‌ ఉండనే ఉంది. ఇంకా కొన్ని వీడియో షేరింగ్‌ సైట్లలోనూ మన సినిమాను అప్‌లోడ్‌ చేయొచ్చు.
అందుబాటులో ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ అన్నీ చూడండి. వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. కొన్ని షార్ట్‌లకు రఫ్‌స్క్రిప్ట్‌ ఎలా జరిగిందో…, ఫెయిర్‌ స్క్రిప్ట్‌లు ఎలా ఉంటాయో… ఔత్సాహికులు తెలుసుకునేందుకు నెట్‌లో ఉంచుతున్నారు కూడా. హాలీవుడ్‌ స్క్రిప్ట్‌లకయితే కొదవే లేదు.ఓపిగ్గా వెతికి పట్టుకోవాలంతే. షార్ట్‌ తీసే ముందు…తర్వాత…ఎప్పుడైనా….మీరేం చేయాలనుకుంటున్నారో మొత్తం… ఓ పేపర్‌/బుక్‌లో నోట్‌ చేసుకుంటే పని ఈజీ. ఇంకా బ్యాలెన్స్‌ ఏముందో చెక్‌ చేసుకోవచ్చు.
ప్రచారం ఎలా….
వీటిని ఇంటర్నెట్‌ ద్వారా విస్త్రతంగా జనబాహుళ్యం(ప్రపంచం)లోకి ప్రవేశపెట్టవచ్చు. వీడియో షేరింగ్‌ సైట్లు ఆపనిని చాలా సులువు చేసేశాయి. ఆన్‌లైన్‌లోనూ కొన్ని ఫిల్మ్‌ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. అవీ ప్రచారానికి ఉపకరించేవే.
ఎలా ఉండాలి…
షార్ట్‌ కమర్షియల్‌ కాదనేది మర్చిపోవద్దు. యూనివర్శల్‌ ఫార్ములాతో కలకాలం నిలిచేలా ఉండాలి. తక్కువ ఖర్చుతో సులువుగా రూపొంది మీ టాలెంటుకు అంతే సులువుగా గుర్తింపు తెస్తుంది.
ఎవరు తీయాలి…
ఔత్సాహికులెవరైనా తీయొచ్చు. కళ పట్ల వీరావేశం, అత్యుత్సాహం ఆవశ్యం అంతే.
షార్ట్‌-కొన్ని నిజాలు…
ఆస్కార్‌ గ్రహీత, బాలీవుడ్‌ దర్శకుడు సత్యజిత్‌ రే ఓవర్‌నైట్‌లోనే మహారాజా కాలేదు. మహారాజా అయిన తర్వాత మాత్రం… ఆయన సినిమాలను దూరదర్శన్‌ భవిష్యత్‌ తరాలకు పాఠాలుగా వల్లించింది.
2005లో అశ్విన్‌ కుమార్‌ రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘లిటిల్‌ టెర్రర్‌’ …లైవ్‌ యాక్షన్‌ కేటగిరీలో బెస్ట్‌ఫిల్మ్‌గా నామినేట్‌ అయాక …’సినిమాకి ఇదో ప్రత్యేక ఫార్మాట్‌’ అనే గుర్తింపు దక్కింది. ‘మూడుగంటలు పొడవైన సినిమానే తీయాలా? 40నిమిషాల్లో చేతాకాదా? ఓ కథ చెప్పడానికి మూడునిమిషాలు చాలదా? యాడ్‌, టెలీఫిల్మ్‌, డాక్యుమెంటరీ …ఇవే కానక్కర్లేదు’ అనే ధోరణి పరిశ్రమలో ప్రబలింది. బాలీవుడ్‌లో ఈ ధోరణి చాలా ముందుగానే ప్రారంభమైంది. షార్ట్‌మూవీ అక్కడ ప్రత్యామ్నాయ సినిమాగా ఎదిగింది. వాటికోసం ఎదురుచూసే ప్రేక్షకులూ ఇప్పుడక్కడ ఉన్నారు.అది టాలీవుడ్‌కు పాకడం ఇప్పట్లో అంత సులువు కాకపోవచ్చేమో! దానికి కారణాలు అనేకం.
ఉత్తర భారతదేశంలో ఓ రెండు టివి చానళ్లు సైతం దేశీయ షార్ట్‌ఫిల్మ్‌లను ప్రమోట్‌చేయడానికి తలుపులు తెరిచాయి కూడా. అలాగే షార్ట్‌ఫిల్మ్‌ల అభివృద్ధికోసం పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ట్రస్ట్‌,
సరస్వతి మ్యూజిక్‌ కాలేజ్‌ అనే రెండు ఫోరమ్‌లు ఢిల్లీలో ఏర్పడ్డాయి. షార్ట్‌ఫిల్మ్‌ను ప్రమోట్‌ చేయడానికి ముంబైలో సైరస్‌ అనే వ్యక్తి ఏడేళ్లక్రితం ‘షామియానా’ అనే క్లబ్‌నుసైతం ప్రారంభించారు. అది నేడు ముంబై నుంచి పూణె, బెంగళూరు, కలకత్తా వంటి మెట్రోసిటీలకు పాకింది. అదేవిధంగా పూరిలో ప్రతి ఫిబ్రవరిలో నిర్వహించే ‘ఒదిషా’లో ఎవరైనా తమ షార్ట్‌లను ప్రదర్శించవచ్చు.
ప్రతికూలత:తూర్పు ఐరోపా, మెక్సికో, అమెరికాల్లో షార్ట్‌ఫిల్మ్‌ తీసేవారికి ప్రభుత్వ అండదండలు ఉంటాయి. ఇక్కడ అది శూన్యం. మోనిటరింగ్‌ సెల్‌ అనేదే ఉండదు.
షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌…
ప్రపంచంలో కొన్ని బెస్ట్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్ట్స్‌:
క్లెర్మాంట్‌ ఫెర్రాన్డ్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్ట్‌(ఫ్రాన్స్‌)…ప్రపంచంలోనే అతి పురాతన, భారీ ఫిల్మ్‌ ఫెస్ట్‌
బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: ప్రపంచంలోనే హై ప్రొఫైల్‌ ఫెస్ట్‌ ఇది.
మిడ్‌-ఫిబ్రవరి సండేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(యుఎస్‌ఎ): ప్రపంచంలో ఒక హైప్రొఫైల్‌ ఫెస్ట్‌ గా గుర్తింపు పొందింది.
రియో డి జనెరియో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (బ్రెజిల్‌): సౌత్‌ ఆఫ్రికన్‌ షార్ట్‌లు, హాలీవుడ్‌ గ్లామర్‌ ఇక్కడ తళుకులీనుతుంది.
కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఫ్రాన్స్‌): ప్రతి ఏటా అక్టోబర్‌-నవంబర్‌ మాసంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్నిభాషా చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. రియో బీచ్‌లు కళకళలాడుతాయి. ఈ చిత్రోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైనది కూడా.ఇక్కడ ప్రదర్శించిన షార్ట్‌లు మంచి గుర్తింపు దక్కి అవకాశాలు వెల్లువెత్తుతాయి.
మనదేశం కూడా 2009లో ఫిల్మ్‌ఫెస్ట్‌పై దృష్టి సారించనుంది. అందుకు సంబంధించిన సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు మిస్‌కావద్దు.
—– —– —– —— ——- ——– ——- ——
సినిమాకు ప్రత్యేక శోభను తెచ్చే చిత్రోత్సవాల గురించి మరింత సమాచారం:
దేశంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు
సినిమాయే లోకంగా, అందులోనే కెరీర్‌ వెతుక్కునేవారు ముఖ్యంగా దేశంలో జరిగే చలనచిత్రోత్సవాలను ఏమాత్రం మిస్‌ చెయ్యరు. వీలుంటే అక్కడికి వెళ్లడం, లేకపోతే ప్రదర్శించిన సినిమాల డివిడిలు, సిడిలు ఏదోలా సంపాదించి స్టడీ చేస్తారు. అంతటి ప్రాముఖ్యత ఈ చలనచిత్రోత్సవాలకు ఉంది.
హైదరాబాద్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(హెచ్‌.ఐ.ఎఫ్‌.ఎఫ్‌) : హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ సారథ్యంలో ఇప్పటికి రెండుసార్లు నిర్వహించారు. ప్రపంచ సినిమాను మన కళ్లముందుకు తెచ్చిన ఘనత ఈ క్లబ్‌కే దక్కుతుంది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన చిత్రోత్సవాల్లో 35దేశాలకు చెందిన 150 సినిమాలు ప్రదర్శించారు. 30మంది నవదర్శకులు 30కి పైగా లఘుచిత్రాలతో ఆరంగేట్రం చేశారిక్కడ. ఆ సంఖ్య రానున్న రోజుల్లో పదిరెట్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘సినిమా’కి ఇది కొత్త ఊపునిచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రోత్సవ విజయం సినిమాకి మరింత వన్నె తెచ్చేందుకు ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో మన చిత్రపరిశ్రమలో రావాల్సిన మార్పులను సైతం ఈ చిత్రోత్సవం సూచించింది. ఈ సందర్భంగా ప్రపంచసినిమాను మన ముంగిటకు తేవడానికి కృషి చేసిన ఓ క్లబ్‌ గురించి తెలుసుకోవలసిందే.
హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌: అమీర్‌పేట సమీపంలోని సారథీస్టూడియోస్‌ ప్రాంగణంలో హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ కొలువుతీరింది. ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్‌బెనగల్‌ 30ఏళ్లక్రితం ఈ క్లబ్‌ను స్థాపించారు. ప్రస్తుతం దీనిని ప్రకాశ్‌ రెడ్డి, ఎం.వి రఘు వంటి ప్రముఖులు నిర్వహిస్తున్నారు. సినీ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతూ ఏటా 200 పైగా చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారెవరైనా కేవలం రూ.500తో ఇక్కడ మెంబర్‌షిప్‌ పొందితే చాలు. సంవత్సరమంతా ప్రదర్శించే సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు. విద్యార్థులు, ఉద్యోగస్తులు,సినిమా తీసే ఆసక్తి ఉన్న ఎవరైనా ఇందులో సభ్యులు కావచ్చు. ప్రపంచ నలు మూలలనుంచి వచ్చే అత్యుత్తమ సినిమాలను వీక్షించవచ్చు. అదేగాక ఆయా సినిమాల గురించి, దర్శకుల గురించి పరిచయ, చర్చాకార్యక్రమాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఈ క్లబ్‌ పుణ్యమా..అని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు నేడు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. సినిమాను కేవలం వినోదప్రధానంగా కాక వివిధ దేశపరిస్థితులను, అక్కడి ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలనూ, వారి సమస్యలనూ తెలుసుకోవడానికి సినిమా ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందనుకునే వారికి ఈ ఫిల్మ్‌ క్లబ్‌ …బెస్ట్‌ చిరునామా. కొత్తగా సినిమా రంగంలోకి ఆరంగేట్రం చేయాలనుకునేవారికి సహాభిప్రాయాలు కలిగిన వారిని కలుసుకోవడానికి, ప్రపంచంలోని వివిధ దేశాల చిత్రాల శైలితెలుసుకోవడానికి కూడా క్లబ్‌ ఉపయోగపడుతుంది.
ఇదే తరహాలో కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ కూడా అలుపెరగని కృషి చేస్తోంది. సినిమా వృద్ధికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా… ‘నేషనల్‌ షార్ట్‌ అండ్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2009′ నిర్వహించడానికి సన్నద్దమవుతోంది. ఫిభ్రవరి 14నుంచి 19 వరకూ ఈ ఫెస్ట్‌ జరుగుతుంది.
ఎంట్రీలకు 31డిసెంబర్‌ చివరితేదీ. మరిన్ని వివరాలకు ‘నవతరంగం’ సినిమా వెబ్‌సైట్‌ను సందర్శించండి. సినిమాకు సంబంధించిన సమగ్రసమాచారం, విజ్ఞానం కూడా ఈసైట్‌లో లభ్యమవుతోంది. పరిశ్రమలో ఎంట్రీకోసం వచ్చేవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో శిద్ధారెడ్డి వెంకట్‌ ‘నవతరంగం’ను నిర్వహిస్తూ తనవంతు కృషి చేయడం గమనార్హం. అలాగే అభినందనీయం కూడా.
కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం :
వీటిని కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రతియేటా నిర్వహిస్త్తోంది. ఈసారి నిర్వహించిన 13వ చలనచిత్రోత్సవం ఈనెల (డిసెంబర్‌) 12న ప్రారంభమైంది. తిరువనంతపురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల నుంచి అత్యుత్తమ చిత్రాలెన్నింటోనో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ‘కాంపిటీషన్‌’ విభాగంలో 14చలనచిత్రాలు, డాక్యుమెంటరీ విభాగంలో 18చిత్రాలు, ‘ఇండియన్‌ సినిమా టుడే’ విభాగంలో 5ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ‘మలయాళం సినిమా నౌ’ విభాగంలో 7సమకాలీన మలయాళీ సినిమాలు ప్రదర్శించనున్నారు. అవేగాక ‘ప్రపంచ సినిమా’ విభాగంలో 55 చలనచిత్రాలు 25 ‘లఘుచిత్రాలు’ ప్రదర్శించారు.
గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు :
గోవాలో ఇప్పటికి 39 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరిగాయి. ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2008 పేరుతో నవంబర్‌లో 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు నిర్వహించారు. అక్కడ మలయాళీ సినిమా ‘పులిజన్మం’ 54వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాలో ఉత్తమ సినిమాగా ఎన్నికైంది.ఇంకా పలు భాషా చిత్రాలు ప్రదర్శనకు నోచుకున్నాయి.
భారతదేశంలోనే అత్యంత ప్రాచీన చలనచిత్రోత్సవమిది. గతంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో ఈ చిత్రోత్సవం జరుగుతుండేది. కొన్నేళ్లక్రితం ఈ చిత్రోత్సవానికి గోవాని పర్మనెంట్‌ వేదికగా నిర్ణయించారు. అప్పటినుంచీ ఈ చిత్రోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబరులోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ సినిమాలను ప్రదర్శించడంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశ/భాషల సినిమాలను ప్రదర్శించారు.
‘షార్ట్‌’ మేకింగ్‌-మరికొన్ని సూచనలు
నటీనటులు, సిబ్బంది(కేస్ట్‌ అండ్‌ క్రూ)ని సిద్ధం చేయండి.
అవసరం మేరకు డబ్బు సిద్ధం చేసుకోవాలి. ఫ్యామిలీ,బంధువులు, ఫ్రెండ్స్‌ మంచి సోర్సెస్‌.
పనిని చిన్న బ్లాకులుగా విభజించాలి. అనుకున్న సమయంలోగా పూర్తి చేసేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా ఖర్చు పెరిగినట్లే.
స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు పాత్రల స్వభావం మేరకు పాత్రదారులను సిద్ధం చేయాలి. నటులతో ముందుగా ఆడిషన్స్‌, రిహార్షల్స్‌ చేయించాలి.
ఏ లొకేషన్లలో చిత్రీకరణ ఉంటుంది ముందుగా వర్కవుట్‌ చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు లొకేషన్‌ పర్మిట్లు పొందాల్సి ఉంటుంది. డిజిటల్‌ కెమెరాలో స్పాట్‌లు, అవసరమైన సీనరీలను బంధించి ఉంచుకోవాలి. ఎనీటైమ్‌ మనతో కెమెరా ఉండాల్సిందే.
స్థానిక ఫిల్మ్‌స్కూల్స్‌, కాలేజ్‌లు, మల్టీమీడియా స్కూళ్లలో కెమెరా ఆపరేటర్లు, లైటింగ్‌ స్పెషలిస్టులు, స్క్రిప్ట్‌ సూపర్‌వైజర్లు, బూమ్‌ మైక్‌ కుర్రాడు, అవసరానికి పరిగెత్తే కుర్రాళ్లను సిద్ధం చేసుకోండి.
రెంటెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (కెమెరా, లైటింగ్‌, 15అడుగుల మేర కదిలే మూవింగ్‌ ట్రక్‌ మొ…) సమయానికి సిద్ధం చేసుకోండి.
కేటరింగ్‌ విభాగంలో బాటిళ్లతో మంచినీళ్లు, స్నాక్స్‌ మరువద్దు. (మూడ్‌ బాగోపోతే ముద్దపడగానే అయిడియా వచ్చుద్ది). లంచ్‌ షరా మామూలే.
సమయానికి మాత్రమే లొకే షన్‌కి రాగలిగే నటులకు అవసరమైతే వాహనం ఎరేంజ్‌ చేయాల్సి ఉంటుంది.
సొంత కంప్యూటర్‌, అందులో మాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంటే…’ఆపిల్‌ ఫైనల్‌ కట్‌ ప్రో’ అనే ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో ఎడిటింగ్‌ చేయొచ్చు(ఆల్రెడీ ఎడిటింగ్‌ నైపుణ్యం ఉన్నవారు). లేదా ఎడిటింగ్‌ ప్రయివేటుగా చేయించుకోవాల్సిందే.
మూవీ పూర్తయ్యాక పబ్లిసిటీకి పనికొచ్చే కొన్ని సీన్లను వైబ్‌సైట్లకు ఇవ్వండి.
కొన్ని కంపెనీలు మన సినిమాని ప్రమోట్‌ చేయడానికి డివిడి రైట్స్‌ కూడా కొంటాయి…. సరుకుంటే గనుక. వాటి వివరాలు సేకరించండి.
డివిడిలకు సిద్ధమైతే గనుక…వాటిపై కవర్‌ ఆర్ట్‌ హైలైట్‌ చేయగలగడం ఓ వ్యాపార లక్షణం. తర్వాత…డివిడిలను ఫిల్మ్‌ఫెస్ట్‌లకు పంపండి. ఏ ఫిల్మ్‌ఫెస్ట్‌కి మన సినిమా సూటబుల్‌ అనేది గుర్తెరిగి పంపాలి. కొన్నింటికి ప్రవేశరుసుం వసూలు చేస్తారు. ఫార్మాలిటీస్‌ తెలుసుకోండి.
షార్ట్‌ డివిడిలో ఫెస్ట్‌ నిర్వాహకులు యాడ్స్‌కూడా మిక్స్‌ చేసే యోచేన చేయొచ్చు. ఎందుకంటే ఫిల్మ్‌ఫెస్ట్‌ను ప్రమోట్‌ చేయాలి కదా!
న్యూస్‌పేపర్స్‌, వీక్లీలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, లోకల్‌ బ్లాగులు, వెబ్‌సైట్లు….ఇలా వేటిద్వారానైనా మనసినిమాకి ప్రచారం పొందొచ్చు. ఆయా వ్యక్తుల దగ్గర అవసరమైన మేర చొరవ, స్థితప్రజ్ఞత ప్రదర్శించాలి.
ఫెస్ట్‌ల్లో సక్సెస్‌ అయితే….డైరెక్టర్‌, యాక్టర్‌, నిర్మాత…ఎవరైనా ఫోన్‌లో అందరికీ టచ్‌లో ఉండాలి. ఫోన్‌ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. జస్ట్‌ ఇమేజిన్‌.
సినిమా తీసేశామంటే సంబరం కాదు. విమర్శకులుంటారు. నక్కకీ నాగలోకానికీ ముడిపెడతారు. అన్నింటికీ మానసికంగా సిద్ధపడాలి.
–శివాజి (ఆంధ్రజ్యోతి సినిమా న్యూస్, హైదరాబాద్ బ్యూరో )

No comments:

Post a Comment